Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

శ్రీకాకుళం జిల్లాలో రహదారుల కు నిధులు మంజూరు చేయాలి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

విశాలాంధ్ర – శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని రహదారుల సమగ్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంతో పాటు నిధులు మంజూరు చేయాలని పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి నీ కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ ని ఢిల్లీలో కలిసి పార్లమెంటరీ పరిధికి సంబంధించి 3 ప్రధాన అంశాలపై వినతిపత్రంలో అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలను జల, రోడ్డు, రైలు రవాణాకు అనుకూలంగా మలచేలా రహదారులను విస్తరించాలని కోరారు. దీని వల్ల జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను పెంచవచ్చని తెలిపారు. ఇందులో భాగంగ చెన్నై-కోల్ కత్తా 16వ నంబర్ జాతీయ రహదారిలో 4 రాష్ట్రాలకు చెందిన వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయని గుర్తు చేశారు. సరుకు రవాణాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ మార్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా 4లైన్ల రోడ్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో నరసన్నపేట-ఇచ్ఛాపురం మధ్య 100 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని 6లైన్లకు విస్తరించాలని ప్రతిపాదనలు అందించారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉన్న పలు రహదారులను అంతరాష్ట్ర రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ఎంపీ విన్నవించారు. ఇందులో భాగంగా కళింగపట్నం-పార్వతీపురం వయా ఆమదాలవలస, పాలకొండ, వీరఘట్టం(సీఎస్ పీ) రోడ్డును ఒడిశా లోని రాయగడ వరకు విస్తరించాలన్నారు. అలికాం-బత్తిలి రోడ్డును వయా గార, ఆమదాలవలస, హిరమండలం, కొత్తూరు మార్గాన్ని ఒడిశా లోని గుణుపూర్ వరకు అనుసంధానించాలన్నారు. నౌపడ-నరసన్నపేట-మెళియాపుట్టి (డీపీఎన్) రహదారిని భావనపాడు పోర్టుకు కలుపుతూ పూండి, బెండిగేట్, సంతబొమ్మాలి, పోలాకి మీదుగా ఒడిశా లోని పర్లాకిమిడి వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని విన్నవించారు. దీనితో పాటు జిల్లా పరిధిలోని 17 ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు, వ్యవసాయ పనులకు మార్గం కల్పిస్తూ 16వ నంబర్ జాతీయ రహదారిలో అండర్ పాసేజ్ లు, కల్వర్టులు ఏర్పాటు చేయాలన్నారు. టెక్కలి సమీపంలో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి భారీ వాహనాలు సులభంగా హైవే పైకి చేరుకునేలా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. కాగా… దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ తో పాటు మాజీ ప్రభుత్వ విప్, శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img