Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అక్రమాలకు పాల్పడితే నిధులు రికవరీ చేస్తాం

డ్వామా పిడి జివి చిట్టి రాజు

విశాలాంధ్ర – శ్రీకాకుళం: ఉపాధి హామీ పథకం సిబ్బంది అక్రమాలకు పాల్పడితే నిధులు రికవరీ చేయడంతో పాటు అవసరం మేరకు కఠినమైన చర్యలు చేపడతామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జివి చిట్టి రాజు స్పష్టం చేశారు. గురువారం డ్వామా కార్యాలయంలో జరిగిన జి శిగడాం మండల సామాజిక తనిఖీ ప్రజా వేదికలో పిడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ డీఆర్పీలు మండలంలో ఇప్పటివరకు కూలీలకు వేతనాల రూపంలో రూ. 11.90 కోట్లు, మెటీరియల్ పనుల నిమిత్తం రూ.2.80 కోట్లు వెరసి రూ 14.71 కోట్లు నిధులు వ్యయం చేసినట్లు వెల్లడించారు. చిన్న చిన్న పొరపాట్లు తప్ప మండలంలో ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలైనట్లు సామాజిక తనికి డిఆర్పీలు తెలియజేశారు. ప్లాంటేషన్ పనులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు వేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తమ పరిశీలనలో ఎటువంటి లోటుపాట్లు వెలుగు చూడలేదని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పిడి జీవి చిట్టి రాజు మాట్లాడుతూ, ఉద్యోగులు, ప్రజావేదికకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మండలంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా వేదికలో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి అవసరమైన మేర చర్యలు తీసుకుంటామని అన్నారు. పోయిన మొక్కల స్థానంలో తక్షణమే కొత్త మొక్కలను నాటాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, జాబ్ కార్డు లేనివారిని పనికి రాకుండా చూడాలన్నారు. క్షేత్ర సహాయకులు సగటు వేతనం పెరిగే విధంగా ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. మస్టర్ షీట్లలో ఎటువంటి దిద్దుబాట్లు ఉండకూడదని అన్న ఆయన వేసవికాలం నేపథ్యంలో ఉదయం, సాయంత్రం చల్లని సమయాల్లో పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో చిన్న పొరపాటుకు కూడా ఉద్యోగులు అవకాశం ఇవ్వకూడదని సుతి మెత్తగా హెచ్చరించారు. వివోఏలు, ఆశ వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడి సిబ్బంది ఉపాధి హామీ పనులకు రాకూడదన్నారు. ఈ ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి బి లవరాజు, ఫైనాన్స్ మేనేజర్ స్వరూప రాణి, ఏపీడి కే లోకేష్, ఎంపీడీవో ఎస్ శ్రీనివాసరావు, ఎస్ఆర్పి సింహాద్రి, పరిపాలనాధికారి ప్రసాదరావు, హెచ్ ఆర్ మేనేజర్ శ్రావణ్ కుమార్, సహాయ విజిలెన్స్ అధికారి సురేష్ కుమార్, ఏపీవో సత్యనారాయణ, డిఆర్పీలు, మండల ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img