Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

జీవితంలో సగభాగం ఉద్యమాలకే అంకితం

జర్నలిస్టు నేత అంబటికి ఘన నివాళి
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం తన జీవితంలో సగభాగాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు అంబటి ఆంజనేయులు అని శనివారం ఉదయం స్థానిక క్రాంతి భవన్లో జరిగిన సంతాప సభలో జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చింతాడ అప్పలనాయుడు అధ్యక్షతన సభ జరిగింది. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు, సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ, ఇటీవల మరణించిన ఆంజనేయులు ఉద్యమ జీవితాన్ని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులుగా ఆయన సుదీర్ఘకాలం సేవలు అందించారని చెప్పారు. నాన్ జర్నలిస్టుల సంఘానికి మరణించే వరకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు ఉన్నారని , ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలు మూతపడినప్పుడు, వాటిని తెరిపించడానికి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఉద్యమ జీవితంలో ఆయన నిబద్ధత, నిజాయితీ ఆదర్శవంతమైనదని అన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ, మన జిల్లాతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. జిల్లా యూనియన్ నిర్మాణంలో ఆయన పాత్ర చాలా కీలకమైనదని నివాళి అర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత చిన్న మధ్య తరహా పత్రికల సంఘం స్థాపించడానికి సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంవి మల్లేశ్వరరావు తెలిపారు. వామపక్ష భావాలు గల నాయకుడని సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామమూర్తి గుర్తు చేసుకున్నారు. ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు మాట్లాడుతూ, అభ్యుదయ కార్యక్రమాలకు ఆంజనేయులు చేయూతనందించే వారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలవేసి జర్నలిస్టులు, ఇతర సంఘాల ప్రతినిధులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, ఇస్కఫ్ జిల్లా కార్యదర్శి జీవీ నాగభూషణరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ జిల్లా కన్వీనర్ వి ఎస్ నాయుడు, యూనియన్ జిల్లా నాయకులు ఎస్ వి సత్య ప్రసాద్, వేణుగోపాలచార్యులు, అల్లు భాస్కరరావు కొమర భాస్కరరావు, ఎస్ నవ చైతన్య, కుంచె చిన్నారావు, చంద్రపతిరావు, వడ్డాది విజయ్ కుమార్, ఎం కళ్యాణ చక్రవర్తి, ముళ్ళపూడి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img