Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

వర్సిటీలో..గిడుగు.. పీఠం ఏర్పాటు చేయాలి

జర్నలిస్టు నాయకులు నల్లి ధర్మారావు డిమాండ్
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్ : తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు గారి పేరుతో, డా.బి ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ లో భాషా, కలింగాంధ్ర చరిత్ర పీఠం ఏర్పాటు చేయాలని ఐజేయు నాయకులు నల్లి ధర్మారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం మాతృభాషా దినోత్సవం సందర్భంగా, శ్రీకాకుళం లోని నాగావళి తీరంలో గల గిడుగు రామ్మూర్తి విగ్రహానికి ఏపీయూడబ్ల్యూజే, స్సామ్నా, అరసం, ఇస్కఫ్ తదితర సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గిడుగు రామమూర్తి జీవితం పూర్తిగా తెలుగు వాడుక భాష కోసం, సవర భాష కోసం, కళింగాంధ్ర చరిత్ర కోసం అంకితం చేశారని ధర్మారావు చెప్పారు. డాక్టర్ వైయస్ ప్రభుత్వ హయాంలో, కొత్త యూనివర్సిటీలు మంజూరైనప్పుడు, కడప యూనివర్సిటీ కి యోగి వేమన పేరు, రాజమండ్రి యూనివర్సిటీ కి ఆదికవి నన్నయ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే ఎచ్చెర్ల యూనివర్సిటీకి గిడుగు పేరు పెట్టాలని జిల్లాలోని అనేక సంస్థలు సూచించినా, రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టలేదని చెప్పారు. గిడుగు వారు జన్మించిన సరుబుజ్జిలి మండల ప్రజా పరిషత్ కూడా, ఆయన పేరు పెట్టాలని తీర్మానించినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ, గిడుగు వారి జన్మస్థలం పర్వతాల పేట అగ్రహారం అని వెలుగులోకి తెచ్చిందే ఏపీయూడబ్ల్యూజే అని చెప్పారు. ఆ గ్రామంలో అతని విగ్రహం ఏర్పాటుకు ఎంతో కృషి చేశామని తెలిపారు. కార్యక్రమంలో సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.వి మల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నవచైతన్య, ఇస్కఫ్ జిల్లా కార్యదర్శి జీవీ నాగభూషణరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల నాయకులు మల్లారెడ్డి కళ్యాణ చక్రవర్తి, కనకల రామారావు, సింగూరు శ్రీనివాసరావు, లీగల్ జర్నలిస్టుల సంఘం నాయకులు పొడుగు రాజు, సామాజిక కార్యకర్తలు గణేష్, అల్లు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img