Friday, October 7, 2022
Friday, October 7, 2022

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వనిత

విశాలాంధ్ర – పార్వతీపురం/బెలగాం : పార్వతీపురం మన్యం జిల్లాలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మన్యం జిల్లాలో మొట్టమొదటి స్వాతంత్ర్య వేడుకలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వేదిక వద్దకు చేరుకొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ విచ్చేసి గౌరవ వందనం స్వీకరించారు. తొమ్మిది గంటలకు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. పెరేడ్ కమాండర్ డిఎస్పీ సుభాష్ నేతృత్వంలో బ్యాండ్ కమాండర్ యం. మల్లేశ్వరరావు, ఆర్ఐ కె. శ్రీరాములు, ఆర్ఎస్ఐలు బి. ప్రసాద్, విజయ్ కుమార్ లతో 53 మంది ఆర్ముడు రిజర్వ్ సిబ్బంది పాల్గొని పెరేడ్, మార్చ్ ఫాస్టును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తిచేసుకుని 76వ వసంతంలోకి అడుగుడుతున్న వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. జిల్లాలో తోటపల్లి, జంఝావతి భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు ఉండి సాగునీరు, తాగునీరు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలలో అభివృద్ధికి పునాదులు వేసిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రధానంగా వ్యవసాయక జిల్లా కావడంతో అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. జగనన్న శాశ్వత భూ-హక్కు, భూరక్ష కార్యక్రమం క్రింద అన్ని గ్రామాలలో రీసర్వే పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో నాడు నేడు పథకం ద్వారా చేస్తున్న పనుల ప్రగతిని వివరించారు. అన్ని రంగాలలో పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా పలు శాఖలు తమ శాఖల ప్రగతిని తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించాయి. అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలలు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకర్షించాయి. అనంతరం జిల్లాలోని ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు, మండల అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేతులమీదుగా అందజేశారు. ఇటీవల ఉత్తమ సేవలు అందించిన స్థానిక జిల్లా ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ వాగ్దేవికి ప్రశంసా పత్రంతో పాటు మెమోంటో అందజేశారు. పోలీస్ శాఖలో ప్రత్యేక కనబరిచిన పలువురికి పురస్కారాలను అందజేశారు. జిల్లాలో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హోం శాఖ మంత్రికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల చేతుల మీదుగా మెమొంటో అందజేశారు. అరకు పార్లమెంటు సభ్యురాలు జి. మాధవి, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రమ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావులకు మంత్రి అభినందిస్తూ ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కళాశాలల వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎన్.సి.సి కేడెట్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img