Monday, October 3, 2022
Monday, October 3, 2022

సమన్వయంతో పనిచేసి ఉపాధి పథకాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం

విశాలాంధ్ర – శ్రీకాకుళం : జిల్లాలో ఉపాధి హామీ పథకం సిబ్బంది అందరూ సమన్వయంతో విధులు నిర్వహించడం ద్వారా పథకాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిద్దామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీవి చిట్టి రాజు అన్నారు. బుధవారం జిల్లా నీటి యాజమాన్యం సంస్థ కార్యాలయంలో సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, కలెక్టర్ నమ్మకాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. జాబ్ కార్డు ఉన్నవారందరికీ ఉపాధి కల్పించడం, వంద రోజులు పని దినాలు కల్పన, కూలీలకు గరిష్ట వేతనం అందే విధంగా చేయడం, రికార్డుల నిర్వహణ, సుపరిపాలన అంశాలు పట్ల ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రగతి నివేదికలను తయారు చేయాలన్నారు. జిల్లాలో వేతనదారుల సంఖ్య ఎక్కువ అని, కష్టపడే మనస్తత్వం ఉన్నవారు జిల్లాలో ఉన్నందున జిల్లా ప్రగతికి ఉపాధి హామీ పథకం దోహదపడాలన్నారు. క్షేత్రస్థాయిలో రెండు పూటలా పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పిడి నుండి మేట్ వరకు ప్రతి ఉద్యోగి ఈ పథకంలో కీలకమైన వారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రమశక్తి యోజన పథకం అమలులో జిల్లా దేశంలోనే ఏడవ స్థానంలో ఉండగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్న పిడి సిబ్బందిని అభినందించారు. ఫైనాన్స్ మేనేజర్ విద్యాసాగర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో సిబ్బంది పాత్ర ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్తులో మరింత చక్కగా పథకం జిల్లాలో అమలయ్యేందుకుగాను సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీడీలు లవరాజు, జి హరిత, జయరాం, అలిమేలు మంగమ్మ, మురళీకృష్ణ, శైలజ, డిబిటి మేనేజర్ విజయ వాణి, హెచ్ఆర్ మేనేజర్ శ్రావణ్ కుమార్, సూపరిండెంట్ ప్రసాద్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img