Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెండింగ్ నీటి ప్రాజెక్ట్ లు వెంటనే పూర్తి చేసి కాలువ చివరి భూములకు సాగు నీరు అందించాలి


– పోలవరం ప్రాజెక్టు నీటిని ఉత్తరాంధ్రకు సరఫరా చేయాలి
-వంశధార,ఆఫ్ షోర్ రిజర్వాయ్లర్ పనులు పూర్తి చేసి రెండు పంటలకు సాగు నీరు అందించాలి

విశాలాంధ్ర – శ్రీకాకుళం : ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్ట్స్ పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించుటకు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి ఆరోపించారు.సీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కలక్టరు కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగంలో పని చేస్తూ జీవిస్తున్నారని అన్నారు.పెండింగ్ నీటి ప్రాజెక్ట్స్ పూర్తి చేసి సాగు నీరు అందించుటలో పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు.పోలవరం ప్రాజెక్టు నీటి వాటాను ఉత్తరాంధ్ర జిల్లాలకు వెంటనే పంపకాలు చేసి సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.శ్రీకాకుళం జిల్లాలో వంశధార,ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసి తక్షణమే రెండు పంటలకు సాగునీరు అందించాలని కోరారు.శిధిలమైన వంశధార కాలువలు మరమ్మతులు చేసి కాలువ చివరి భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.వంశధార, ఆఫ్ షోర్ రిజర్వాయర్,కాలువ నిర్మాణాలకు భూములిచ్చి త్యాగం చేసిన నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.రైతులకు ఆదుకొనుటలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి డోల శంకర రావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, ఏ.ఐ.టి.యు.సి.జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు,ముఖ సలహాదారు చిక్కాల గోవింద రావు,సీపీఐ నాయకులు నిమ్మాడ కృష్ణమూర్తి, గార మండల కార్యదర్శి చుక్క వెంకట రావు,కొల్లి దుర్గా రావు, పంచిరెడ్డి అప్పారావు, పోలోడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img