మరో రెండు పెంకుటిల్లుకు పాక్షిక నష్టం
విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలో సుంకరివీదిలోని సేపేనా సింహాచలం(బ్రహ్మయ్య) పెంకుటిల్లులో సోమవారం ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలోఅతని పెంకుటిల్లు పూర్తిగా కాలిపోగా ఇరువైపులా ఉండే రెండుపెంకుటిల్లు కూడా పాక్షికంగా కాలాయి. వివరాలు పరిశీలిస్తే బ్రహ్మయ్య ఇంటి తలుపులువేసి ఇంట్లో ఉండే బార్యా భర్తలు ఇద్దరు పనులకు వెళ్లిన సమయంలో ఒక్కసారి పెంకులలోపల నుండి పొగలురావడాన్ని ప్రక్కఇంటి గడపలో ఉండే సీతానగరం అంగన్వాడీ కేంద్రం-2 పిల్లలుచూసి వారి కార్యకర్త,
ఆయాలకు కేకలేసి చెప్పారు. వెంటనే వారు చుట్టుప్రక్కలఉండే వారిని కేకలేసి పిలువగా వారు విచ్చేసి విద్యుత్ నిలిపివేసి బిందె కుండలతో మహిళలు నీరుతెచ్చి తదపడంచేసినప్పటికీ అదుపు చేయలేకపోయారు. బొబ్బిలి ఫైర్ ఆఫీసుకు కూడా సమాచారం ఇవ్వగా ఫైర్ ఆఫీసర్ ఎం.సాంబమూర్తి, లీడింగ్
ఫైర్ మెన్ జె. కృష్ణ, సిబ్బంది జోగినాయుడు, మురళి, రామక్రిష్ణ, తిరుపతిరావులు విచ్చేసి మంటలను ఎన్నో ఇబ్బందులుపడి అదుపుచేశారు. తడుపుతున్న సమయంలో ఇళ్ళుచాలా భాగం పడిపోవడం గమనార్హం. ప్రక్కనే ఉన్న సుంకరి అప్పారావు,సేపేన వెంకన్న
పెంకుటిల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎస్ఐ నీలకంఠం, విఆర్ఓ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉపసర్పంచ్ అరవింద్, సుంకరి వీదిపెద్దలు,యువకులు, మహిళలతో పాటు సీతానగరం గ్రామపెద్దలు చేరుకొని దగ్గరుండి పరిశీలించారు. బ్రహ్మయ్య ఇంట్లో టీవీ,బట్టలు,సామాగ్రి, మంచాలు, పరుపు,విద్యుత్ వైర్లు,మీటర్, ఫ్యానులు, తదితర సామాగ్రి కాలిపోయాయి. దీంతో పాటు ఇంట్లో మిద్దెమీద కూతురుకు చెందిన మంచాలు, పరుపులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి.అంతా పూర్తయ్యాక బ్రహ్మయ్య బార్య వచ్చి కాలిపోయిన ఇంటినిచూసి లబోదిబోమని ఏడ్చిన తీరుచూసి అక్కడ ఉండే అందరూ కంటతడి పెట్టారు. ఆమెను
ఓదార్చారు. పూర్తిగా ఇళ్లు కాలిపోయిన బ్రహ్మయ్యకు సుంకరివీదిలోని గ్రామపెద్దలు సామాజిక భవనాన్ని, మరోఇంటిని అప్పటికపుడు ఏర్పాటుచేసి కాలిన ఇంట్లో తీసిన సామాన్లను అక్కడికి మహిళలు తరలించారు.