Friday, April 19, 2024
Friday, April 19, 2024

గిరిజన ప్రాంతప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం /సీతంపేట: గిరిజన ప్రాంతంలో గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మంగళ వారం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏను సందర్శించారు.  వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ప్రతి గిరిజనగ్రామంపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజల్లో ముఖ్యంగా కొండప్రాంతాల్లో ఉండే వారికి అవగాహన కల్పించాలన్నారు.తాగు నీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.నీరు కలుషితం కాకుండా చూడాలని, సమయానుసారంగా క్లోరినేషన్ చేయాలని ఆయన ఆదేశించారు. వేడి ఆహార పదార్థాలు తీసుకునేటట్లు చైతన్య పరచాలని ఆయన పేర్కొన్నారు. దోమ కాటుకు గురికాకుండా దోమ తెరలు వాడకం ఉండాలని క్షేత్ర స్థాయి సిబ్బంది నిరంతరం తెలియజేయాలని ఆయన ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి సంఘటనలకు తీవ్రత ఉన్న గ్రామాలలో విస్తృతంగా పిచికారి చేయాలని ఆయన ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పిచికారి జరగాల్సిందే అని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి తీవ్ర పరిస్థితులు తలెత్తరాదని ఆయన ఆదేశించారు. గర్భిణీలు, చిన్నారులు, బాలింతల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వర్షాల సమయంలో ఆసుపత్రికి చేరుటకు సమస్యాత్మకంగా ఉన్నగ్రామాల నుండి గర్భిణీలకు ముందుగానే ఆసుపత్రిలో చేర్చాలన్నారు.
భవనాలను వేగవంతంగా పూర్తిచేయాలి:
ఇంజినీరింగ్ శాఖలు చేపట్టిన భవనాలు, ఇతర నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పనులలో జాప్యం జరగరాదని ఆయన స్పష్టం చేశారు. త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను ప్రగతి పథంలో ఉంచాలని ఆయన సూచించారు. ఈసమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జి. మురళి, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img