Friday, October 7, 2022
Friday, October 7, 2022

ఈ-పంటలో పంటలు వివరాలు తప్పుగా నమోదుచేస్తే కఠినచర్యలు

వ్యవసాయ సలహామండలిసమావేశాలకు బ్యాంకర్లు తప్పని సరిగా హాజరుకావాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆనంద్

విశాలాంధ్ర,పార్వతీపురం: ఈ-పంటలో పంటల వివరాలు తప్పుగా నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ సలహామండలి సమావేశాలకు బ్యాంకర్లు, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులు విధిగాహాజరుకావాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఆనంద్ లు అన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. నెలలో మొదటి శుక్రవారం ఆర్.బి.కె స్థాయిలోను, రెండవ శుక్రవారం మండలస్థాయిలో తప్పనిసరిగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు  వ్యవసాయవిద్యుత్, జలకళ పధకం వివరాలను తదుపరి సమావేశానికి తీసుకురావాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ ఇ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ఇ-క్రాప్ లో పంటలు వివరాలు తప్పుగా నమోదుచేసినా, పంటల వివరాలు తప్పుగా నమోదు చేయాలని అధికారులపై వత్తిడిచేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఆర్.ఒ.ఎఫ్.ఆర్. పట్టాదారులకు పంటరుణాలు మంజూరు చేయుటకు బ్యాంకర్లు ప్రతి వ్యక్తిగత ధరఖాస్తులపై తహశీల్దారు సంతకం అడుగుతున్నారనే విషయం అధికారులు తెలుపగా  మండలానికి సంబంధించిన మొత్తం లిస్టు ప్రతి పేజీ సంతకంతో సర్టిఫైడ్ కాపీ బ్యాంకర్లకు అందజేయాలని, దానినే బ్యాంకు అధికారులు ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.  ఎరువుల విక్రయంలో అవకతవలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.  ఉద్యానవనశాఖద్వారా మంజూరెైన ఇరవైఒక్క పంటల సేకరణ కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. మత్స్యకార సంఘాలకు చేపపిల్లలకొనుగోలు,  పెంపకానికి బ్యాంకు రుణాలు అందించాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ మాట్లాడుతూ చెరుకు రైతుల బకాయిలు పెండింగు ఉన్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ  వర్షాలకు వెంగళరాయసాగర్ ఆయకట్టు, గరుగుబిల్లి మండలం పరిదిలో ముంపునకు గురైన పంటల వివరాలు ప్రాధమిక సమాచారం సేకరించామని, పంటనష్టం పూర్తి వివరాలను సేకరిస్తామని తెలిపారు.   రైతులకు కావలసిన ఎరువులకు కొరత లేదని తెలిపారు.  ఎరువులు అక్రమంగా విక్రయించే వారిపైన, ఎక్కువ ధరలకు విక్రయించే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అక్రమాలపై వచ్చే పిర్యాధులపై విచారణ చేస్తామని ఆయన చెప్పారు. కిసాన్ డ్రోన్లను మండలానికి మూడు చొప్పున మంజూరు అయ్యాయని, ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు పైలట్ శిక్షణకు దరఖాస్తు చేయవచ్చని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి జిల్లాలో గల 154 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 303 గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు.  దేశీయ వరివంగడాలు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ ఇ-పంట నమోదులో రెవిన్యూ సిబ్బంది సహకారం ఉండాలని కోరారు. జిల్లాకు ఒక్కొక్కటి పదహేనులక్షల రూపాయలు వ్యయంతో ఇరవైఒక్క  వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు.  వాణిజ్యపంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పద్నాలుగు వందల హెక్టార్లకు సరిపడా ఆయిల్ ఫాం మొక్కలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారులను ఆదుకొనుటకు ప్రవేశపెట్టిన వై.ఎస్.ఆర్. భీమా పధకం అయిదు లక్షలనుండి పది లక్షల రూపాయలకు పెంచడమైనదని తెలిపారు. మత్సకారులకు మత్స్యసాగుబడికి సబ్సిడీపై  యూనిట్ రూపాయియాబై పైసలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం పది లక్షల చేపపిల్లలు లక్యంగా నిర్ణయించామని, నవంబరు మొదటివారంలో వాటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  జిల్లాలో యాబై సంవత్సరాలు పైబడిన మత్స్యకారులు 755మందికిప్రతినెలరెండువేలఅయిదు
వందల రూపాయలు పెన్షను అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా పశుసంవర్దకశాఖాధికారిఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో34వేలపశువులకు బొబ్బరవ్యాధి నిరోధకటీకాలు వేసినట్లు తెలిపారు. మనరాష్ట్రంలో ఈవ్యాధి ఎక్కడా నమోదు కానప్పటికి ముందుజాగ్రత్తచర్యగా ఒరిస్సా సరిహద్దు జిల్లాలలో ఈకార్యక్రమం చేపట్టామన్నారు.త్వరలో లక్ష పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు.
ఈ సలహా మండలి సమావేశంలో, ఇపిడిసిఎల్ డిఇ వి.వి.కృష్ణ, ఎ.పి.సీడ్స్ జిల్లా మేనేజరు పద్మ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి. నాయక్, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img