Monday, September 26, 2022
Monday, September 26, 2022

విద్యార్ధులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాలాంధ్ర విజయనగరం :

ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడే స్థాయికి విద్యావ్యవస్థలో సమూలు మార్పులు తీసుకు వస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రజా భాగస్వామ్యంతో బాబా మెట్టలో ఏర్పాటు అయిన దేవి పార్కును శనివారం ఎం.పి.బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కార్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి ఇంగ్లీష్ బోధించే విధానాన్ని అవలంభించబోతున్నట్లు చెప్పారు. అదేవిధంగా 3వ తరగతి నుండి సబ్జెక్టు వారీగా ఐదుగురు ఉపాధ్యాయులు ఉండే విధంగా మార్పులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా నగరంలోని సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యను అందించాలన్న తల్లిదండ్రుల కలలను సహకారం చేసే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు. నాటి స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సమైక్యత భావం పెంపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. పరస్పర సహకారంతో సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి జరగాలన్నారు. ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటైన దేవి పార్కు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో మూడింతల వైద్య సేవలను పెంచినట్లు గుర్తు చేశారు. సుమారు 1400 వైద్య సేవలు అందుతున్నట్లు వెల్లడించారు. ప్రజల కోసం పనిచేస్తున్న తాము ఇతరుల విమర్శలను పట్టించుకోబోమని స్పష్టం చేశారు. శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్కులో దేవీ నవరాత్రులు వంటి ఉత్సవాలే కాకుండా యోగ మందిరాన్ని, అలాగే యజ్ఞ యాగాలు చేసేందుకు యాగశాలను నిర్మించడం సంతోషకరమని అన్నారు. నగరంలో అభివృద్ధి పనులను ముమ్మరం చేశామని అలాగే ప్రజా అవసరాలను కూడా తీరుస్తున్నట్లు గుర్తు చేశారు. గతంలో ఐదు రోజులకోసారి నీటి పంపిణీ జరిగితే ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి పంపిణీకి అవసరమైన స్టోరేజ్ కెపాసిటీని పెంచామన్నారు. వాటర్ ట్యాంకుల నిర్మాణాలను ముమ్మరం చేసామన్నారు. కాలనీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అవకాశం తోనే ఎమ్మెల్యే పదవిలో ఉన్నామని అన్నారు. పారిశుధ్య మెరుగుదలకు తాము శ్రమదానం చేసిన అనేక సందర్భాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రజా సహకారం కూడా ఉన్నట్లయితే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ మనం చేపట్టే పనులే శాశ్వతంగా ఉంటాయని అన్నారు. మానసిక ప్రశాంతతకు పార్కులు మంచి వేదిక లాంటివని అన్నారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో పార్కు నిర్మాణంతో పాటు సకల వసతులు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు ఉపయుక్తంగా దేవి పార్క్ ఉందని అన్నారు. సామూహిక పూజలు చేసుకునేందుకు వీలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతి దేవి, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండల డైరెక్టర్ బంగారు నాయుడు, స్థానిక కార్పొరేటర్ గాదెం మురళి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, జోనల్ ఇన్చార్జులు బొద్దాన అప్పారావు, స్థానిక నాయకులు కేఏపీ రాజు ,పెప్సీ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img