Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

నాణ్యమైన ఆహారం అందించడమే ఆహార కమీషన్ లక్ష్యం

రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ సిహెచ్. విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడి

విశాలాంధ్ర – శ్రీకాకుళం: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చేయడమే రాష్ట్ర ఆహార కమీషన్ ప్రధాన లక్ష్యమని కమీషన్ చైర్మన్ సిహెచ్. విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా సంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీతతో కలిసి నరసన్నపేట బిసి సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని,బోధనను నిశితంగా పరిశీలించిన ఆయన విద్యార్థులకు అల్పాహారాన్ని పంపిణీ చేసి సహపంక్తిలో కూర్చుని అల్పాహారాన్ని సేవించారు. విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన ఆహారం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేందుకే ఈ కమీషన్ పని చేస్తుందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, ఇందుకు సహకరిస్తున్న అధికారులను అభినందించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో ఫోర్టిఫైడ్ బియ్యం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, వీటిపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. వసతి గృహంలో అందిస్తున్న ఆహారం పట్ల విద్యార్థులను ఆరాతీసిన ఆయన ఆహారం అందించడంలో లోటుపాట్లు, సమస్యలు ఉంటే 94905 51117 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయాలన్నారు. సమాచారం అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందని, దీన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన ఆహారం పొందడం విద్యార్థుల హక్కని, ఆ హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యం వలన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బాలికల వసతి గృహంలో సుమారు 240 మంది విద్యార్థులు ఉన్నారని, అందుకు సరిపడా గదులు లేనందున అదనపు గదులు కావాలని కోరారని, నాడు నేడు క్రింద దీనిపై చర్య తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ ను కోరారు. అనంతరం నరసన్నపేట మండలం తామరపల్లి, సంతబొమ్మాళి మండలం అలుదు గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ బాలామృతం, వైయస్ఆర్ కిట్ ద్వారా 6 రకాల వస్తువులు పంపిణీ, ప్రధానమంత్రి మాతృవందన యోజన క్రింద రూ.5వేలు పారితోషికం వంటి పథకాలపై గర్భిణీ స్త్రీల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ, సింగుపురం కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలను తనిఖీ చేసిన ఆయన అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. తదుపరి సింగుపురం లో గల అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా తయారు కాబడుతున్న ఆహార పదార్థాలను, లాబ్ లను పరిశీలించారు. తొలుత నరసన్నపేట మండలం దేశవానిపేటలోని రేషన్ డిపోను, తామరపల్లిలో ఎం.డి.యు( మొబైల్ డిస్పోజల్ యూనిట్ ) ద్వారా రేషన్ కార్డుదారులకు అందిస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ విధానాన్ని తిలకించారు. ఈ పర్యటనలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ ఎం.విజయసునీత మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె కోరారు. అదనపు తరగతుల కొరకు నాడు నేడులో నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ పర్యటన కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఉపసంచాలకులు సురేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.వి.రమణ, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అదనపు ప్రోజెక్ట్ సమన్వయకర్త డా. జయప్రకాష్, ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు కె.అనంతలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img