Monday, October 3, 2022
Monday, October 3, 2022

లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి

జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

విశాలాంధ్ర-శ్రీకాకుళం: జిల్లాలో వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వరద ముంపు ప్రాంతాలపై అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. వంశధార నదికి 42 వేల క్యూసెక్కుల నీరు చేరిందని, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని అన్నారు. ఇది రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని కావున లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తూరు, భామిని, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, పోలాకి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట మండల తహసీల్దార్లు వారి పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలను చాటింపు ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. వరదలు సంభవిస్తే అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంత నివారణ చర్యలకై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08942-240557 నెంబరు ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరంలో నీరు విడిచిపెట్టడంతో వంశధార నదిలో నీరు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కావున అందుకు తగిన విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖలైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నివారణ సంస్థ, తదితర శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఎంఎస్ఓల ద్వారా కేబుల్ టీవీల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ ప్రసారం చేస్తూ, గ్రామ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమలరావుతో మాట్లాడుతూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. అధికారులందరూ వరద ముంపు ప్రాంతాల తాజా పరిస్థితిని తెలుసుకుంటూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ విజయ సునీత, శ్రీకాకుళం ఆర్.డి.ఓ బొడేపల్లి శాంతి, మండల తహశీల్దార్లు, వి.ఆర్.ఓలు రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img