Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లాలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్ ఎల్ సి ఎన్నికల నిర్వహణపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. జిల్లా లోని 15 మండలాల్లో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 23 నాటికి అర్హులైన పట్టభద్రుల ఓటర్లు 18,520 మంది ఉన్నారని వివరించారు. మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులతో పట్టభద్రుల ఓటరు జాబితా ప్రకారం అర్హులైన ఓటర్లకు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఓటరు స్లిప్ ల పంపిణీ ప్రక్రియ 8వ తేదీతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 13 తేదీన ఉదయం గం.8 ల నుండి సాయంత్రం గం.4 ల వరకు పోలింగ్ జరగనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు పాటశాల, విద్యా సంస్థలు కాంపౌండ్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం బయట ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై అవగాహన వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె.మల్లేశ్వర రావు, బిజెపిపార్టీ ప్రతినిధి ద్వారపురెడ్డి శ్రీనివాస రావు, టిడిపి ప్రతినిధి గొట్టాపు వెంకట నాయుడు, జనసేన పార్టీ ప్రతినిధి పైల శ్రీనివాస్, సీపీఐ ప్రతినిథి రెడ్డిలక్ష్ము నాయుడు, లోక్ సత్తా పార్టీ ప్రతినిధి కె.పాపారావుతదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img