Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కలెక్టర్ చొరవ తో జాతీయ రహదారి యధాస్థితికి

వరద ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్

విశాలాంధ్ర -శ్రీకాకుళం : జిల్లాలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం దరి పెద్ద పాడు వద్ద జాతీయ రహదారి ( ఎన్ హెచ్ 16) మీదుగా నీరు 3 అడుగుల మేర ఉదయం ప్రవహించింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ తో కలిసి జాతీయ రహదారి సందర్శించి వెంటనే వరద ప్రవాహం కట్టడి చేసేందుకు పలు సూచనలు చేయటం తో మధ్యాహ్నానికి యదా స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, గడచిన 12గంటల్లో శ్రీకాకుళం,గార ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని అన్నారు. శ్రీకాకుళంలో 140 మి.మీ, గారలో 150 మి..మీల వర్షపాతం పడిందని అన్నారు.
ఇది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. డివిజన్ల వారీగా చూస్తే టెక్కలి, పలాసలలో సాదారణ వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం డివిజన్లో అత్యధికంగా నమోదైందని, అందులో శ్రీకాకుళం, గార మండలాలు ఉన్నాయన్నారు. నిరంతరాయంగా వర్షాలు కురుస్తుండం వలన కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిందని, రెండు,మూడు గంటల పాటు
వర్షాలు ఆగితే అన్నిప్రాంతాలు యధాస్థితికి చేరుకుంటాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో నిన్నటి నుండి నిరంతరాయంగా వర్షాలు పడుతుండతంతో పెద్దపాడు ప్రాంతంలోని చెరువు ప్రక్కన కల్వర్టు ద్వారా నీరు జాతీయ రహదారిపైకి వచ్చిందని, అధికారులు దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు, తహశీల్దార్ కె.వెంకటరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img