Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రక్తదాతల స్ఫూర్తితో యువత ముందుకు రావాలి

పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: జిల్లాలో రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతల స్ఫూర్తితో యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం యూనియన్ బ్యాంకు నేతృత్వంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తగినంత రక్తనిల్వలు లేవని, ఇందుకు రక్తదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయగలిగితే రక్తం యూనిట్ల కొరత ఉండబోదని తెలిపారు. కళాశాల విద్యార్థులు ముందుకు వచ్చేలా వారిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ ను కోరారు. యూనియన్ బ్యాంకు నిర్వహిస్తున్న ఈ రక్తదాన కార్యక్రమంలో సుమారు 100 మంది రక్త దాతలు ముందుకురావడం, వీరిలో సిబ్బందితో పాటు వినియోగదారులు ఉండటం హర్షనీయమని కలెక్టర్ కొనియాడారు. రక్తదాతలను అభినందించిన కలెక్టర్ ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను, మెడల్స్ లను బహుకరించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో సిబ్బందితో కలసి త్రివర్ణ పతాకాలతో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ కె.గురునాధరావు, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి. జగన్మోహన్ రావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి. హరి ప్రసాద్, ఏజీఎం వై.ప్రవీణ్ బాబు, అసిస్టెంట్ ఎల్.డి.ఎం వెంకటరమణ, తేజేశ్వరరావు, గిరిజాశంకర్, శ్రీధర్, పెంకి చైతన్య కుమార్, బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img