విశాలాంధ్ర - మొయినాబాద్: మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి ప్రశాంత్ (28). అతనికికొన్ని రోజుల కిందటే వివాహమైంది. షాబాద్ మండలంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో గత మూడు నెలలుగా ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు.అయితే ఒకరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న క్రమంలో పాము కాటుకు గురైనట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. అనంతరం ప్రశాంత్ మృతి చెందడంతో మరుసటి రోజు కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు.
ఉద్యోగం చేయడం లేదని తెలిసి తండ్రి ఫిర్యాదు
అయితే తన కుమారుడు అసలు ఉద్యోగమే చేయడం లేదని తెలుసుకున్న తండ్రి కుమ్మరి రాజుకు అనుమానం కలిగింది. ప్రశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు విచారణ చేపట్టి, వారం రోజుల క్రితం ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీయాలని నిర్ణయించారు.
ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం
మంగళవారం మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఆర్ఐ రాజేష్, ఎస్సై వెంకన్న, ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, గ్రామస్తుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ సుధా పోస్టుమార్టం నిర్వహించారు.ప్రశాంత్ మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడవుతాయని ఎస్సై వెంకన్న, ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.


