ఆర్బేట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమి కేటాయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడిరచారు. ఇవాళ హెచ్ఐసీసీ నోవాటెల్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు న్యాయమూర్తులు హాజరైన ఈ సదస్సులో సీఎం మాట్లాడారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆలస్యమైనా హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషమన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతమన్నారు. నగరంలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.