Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అంబేద్కర్‌ విశ్వమానవుడు

. ఇది విగ్రహం కాదు… విప్లవం
. అంబేద్కర్‌ పేరిట అవార్డులు
. 2024లో వచ్చేది మన రాజ్యమే
. హైదరాబాద్‌లో అంబేద్కర్‌ భారీ విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ ఆర్‌.అంబేద్కర్‌ విశ్వమానవుడని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఆయన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమని తెలిపారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌ హుసేన్‌ సాగర్‌ తీరాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించిన 125 అడుగుల అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఒక దిక్సూచి అని తెలిపారు. అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటిందని, ఎవరో అడిగితే అంబేద్కర్‌ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని, సచివాలయానికి కూడా అంబేద్కర్‌ పేరు పెట్టుకున్నామన్నారు. ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉందన్నారు. అంబేద్కర్‌ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉందని, బుద్ధుడి సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇది విగ్రహం కాదు.. విప్లవం అని అన్నారు. ఈ విగ్రహం తెలంగాణ కలలు సాకారం చేసే చిహ్నంగా అభివర్ణించారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్‌ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని, అందుకు అనుగుణంగా అంబేద్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆవార్డు ఇవ్వబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అందుకోసం వెంటనే రూ.51 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్బుపై ప్రతి ఏడాది వచ్చే రూ.3 కోట్లు వడ్డీతో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా నేటికి దళితులు ఇంకా పేదరికంలోనే మగ్గడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికల్లో వచ్చేది మన రాజ్యమే అని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఇదే రకమైన కార్యక్రమాలు చేసేందుకు పార్టీని జాతీయంగా విస్తరించామని తెలిపారు. తప్పకుండా 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే అని, ఇది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చన్నారు. కానీ, ఒక చిన్న మిణుగురు చాలు అంటుకోవడానికి అని అన్నారు. ఈ మధ్య మహారాష్ట్రకు పోతే నా కలలో కూడా ఊహించని విధంగా ప్రోత్సాహం ఆదరణ లభించిందని, త్వరలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, బెంగాల్‌లో కూడా వస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
దేశంలో కొత్త నడవడికకు కేసీఆర్‌ శ్రీకారం : ప్రకాష్‌ అంబేద్కర్‌
దేశంలో కొత్త నడవడిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలుపెట్టారని అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ అన్నారు. అంబేద్కర్‌ జయంతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా ప్రత్యేకంగా నిర్వహించారని ప్రశంసలు కురిపించారు. మనం యుద్ధం చేయవలసింది ప్రజల్లో మార్పుకోసం, వ్యవస్థలో మార్పు కోసం, దేశంలో మార్పు కోసం అని చెప్పారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త దిశ చూపించారని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక అసమానతలపై ఆనాడే అంబేద్కర్‌ పోరాటం చేశారని, అంబేద్కర్‌ స్ఫూర్తితో మళ్లీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని కాపాడేందుకు పోరాటం చేసేందుకు కేసీఆర్‌ దిశ మొదలుపెట్టారని అన్నారు. దేశంలో ఒక్క రిలీజియన్‌ మైనార్టీ మాత్రమే లేదని, కమ్యూనిటీ మైనార్టీ కూడా ఉందని, రిలీజియస్‌ మైనార్టీ తరహాలో కమ్యూనిటీ మైనార్టీ ఉందని ఆనాడే అంబేద్కర్‌ చెప్పారన్నారు. అంబేద్కర్‌ తెచ్చిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన దళితు బంధు పథకం మంచి పథకమని అన్నారు. ఈ దేశంలో ధనవంతుడు… ధనవంతుడిగా, పేదోడు పేదోడిగానే ఉంటాడని, దళిత బంధు ఫలితం రానున్న రోజుల్లో తెలుస్తుందన్నారు. దళిత బంధును ఇవ్వాళ కేసీఆర్‌ ప్రారంభించారని, రానున్న రోజుల్లో మరో ముఖ్యమంత్రి ప్రారంభించాలని ఆకాంక్షించారు. దేశానికి రక్షణపరంగా రెండవ రాజధాని అవసరమని, అది హైదరాబాద్‌ అయితేనే బాగుంటుందని అన్నారు. హైదరాబాద్‌ రెండో రాజధాని అవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉందని, అది నెరవేరాలని కోరుకుంటున్నానని తెలిపారు. హిందువులకు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే ప్రతిపాదన మేరకు ఇండియా, పాకిస్తాన్‌ ఏర్పాటు జరిగాయన్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకుడు లేడు, గతంలో వాజపేయి మాత్రమే జాతీయ నాయకుడని, స్థానిక నేతలకు జాతీయ స్థాయి నేతగా ఎదిగేందుకు మంచి అవకాశం ఉందన్నారు. తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందని, దేశానికి ఇలాంటి నమూనా అవసరమని ప్రకాష్‌ అంబేద్కర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img