Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి : కేటీఆర్‌

వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలి వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి లభించేలా చూస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోకి 1500 కోట్ల పెట్టుబడితో డ్రిల్‌ మెక్‌ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. దీని ద్వారా 2500 మందికి ఉపాధి దక్కుతుందని చెప్పారు. ఇందులో 80శాతం స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని స్పష్టంచేశారు. ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని హైదరాబాద్‌ లో డ్రిల్‌ మెక్‌ స్పా సంస్థ తమ యూనిట్‌ ఏర్పాటు చేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని అన్నారు.
కాగా నేటి నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్‌ పార్క్‌, ఫార్మా సిటీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదు. కనీసం ఈసారి కేంద్ర బడ్జెట్‌ లోనైనా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు అందించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పదే పదే సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అంటున్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే పారిశ్రామికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రం సహకరిస్తే ఇక్కడి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం ఎంతో అవసరం. మా హక్కులు డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img