Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

కేంద్రం రాష్ట్రాలను బలహీనపర్చాలని చూస్తోంది


దాన్ని ఎప్పటికీ సహించేది లేదన్న కేసీఆర్‌..
కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టాలు

కేంద్రంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ప్రధానిని అనేక సార్లు అడిగినా ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో అడ్డొచ్చినా అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగవేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఐటీఐఆర్‌ ఏర్పాటు చేయకుండా ఇబ్బంది పెడుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఐదేళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందన్నారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని తెలిపారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేక మార్లు ప్రధానికి విన్నవించినా ప్రయోజనం శూన్యమన్నారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, కాజీపేట పేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో తీరని అన్యాయం చేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాలను డీలిమిట్‌ చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కావాలనే కాలయాపన చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలమైందన్నారు. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడారన్నారు. దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదని.. రైతులతో పెట్టుకోవద్దని కేసీఆర్‌ మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు. ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోందన్నారు. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయని చెప్పుకొచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. అన్ని రకాల వనరులున్న మనదేశం ఇంకా ఎందుకిలా ఉందని కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రాలను బలహీనపర్చాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎఫ్‌ఆర్బీఎంకు లోబడే కేంద్రాన్ని అప్పులు అడిగినట్లు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష పాటిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణ వల్ల తెలంగాణ ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉజ్వల భారత దేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలన్నారు. దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులను ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img