బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న లక్ష 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దళితున్ని సీఎం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌లో చలనం లేదని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం కనిపించే కేసీఆర్‌కు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య కనిపించదా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల బైఠాయించడంతో ఆ ప్రాంతంలో సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఆమెతోపాటు వైఎస్సార్టీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అంతకుముందు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డికి షర్మిల వినతిపత్రం అందజేశారు.