ఈటల రాజేందర్
జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలను వెంటనే రెగ్యులర్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత 10 రోజులుగా జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలను పర్మినెంట్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరువదిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం పర్మినెంట్ చేయాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉద్యోగ కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా చేయకపోవడం బాధాకరమన్నారు. వారి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకే ఒక డిమాండ్ తో సమ్మె చేస్తే న్యాయం చేయవలసింది పోయి ఉద్యోగాల నుండి తొలగిస్తామని నోటీసులు ఇచ్చి కేసీఆర్ నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించే వరకు మీరు చేస్తున్న పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకుంటున్న ప్రభుత్వం అందులో కీలక పాత్ర వహిస్తున్న ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శిలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణ రెడ్డి, పార్లమెంటరీ నియోజక వర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు, నాయకులు శివరామకృష్ణ, కళ్యాణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.