నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయ వంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 18 మొదలుకుని సీఎం కేసీఆర్‌తో పాటు-, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయ్ విజయన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజల కంటి సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తోంది. 47 పని దినాల్లో ఇప్పటి వరకు 96 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి కాగా, కంటి వెలుగు వడివడిగా కోటికి చేరువ అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల జీవన స్థితిగతులపై సంపూర్ణ అవగాహన కలిగివున్న సీఎం కేసీఆర్ ఎవరూ అడగక ముందే కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిం చారు. పేదింటి పెద్ద కొడుకుగా ఆలోచించిన ఆయన, దృష్టి లోపాలు సవరించేందుకు 2018, ఆగస్టు 15న తొలి విడుత కంటి వెలుగు ప్రారంభించారు. మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం 8 నెలల పాటు- కొనసాగింది. కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి, నిర్విరామంగా, నిరంతరాయంగా కొనసాగిస్తోంది.