Monday, June 5, 2023
Monday, June 5, 2023

తెలంగాణలో బీజేపీ కుట్రలు సాగవు : మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణ గడ్డమీద బీజేపీ కుట్రలు సాగవని, తెలంగాణ‌ సంక్షేమం, అభివృద్ధి యావత్ భారతానికి పాకిందని, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు తిరుగుబాటుకు సన్నద్ధమౌతున్నారని, హస్తిన పీఠం కదులుతుందన్న భయం బీజేపీకి పట్టుకుందని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ బాస్‌లకు వణుకు అని వ్యాఖ్యానించారు. మోదీ సొంత రాష్ట్రంలో దారిద్య్రం పెరిగిందన్నారు. ఆ రాష్ట్రంలో 35 శాతానికి పైగా జనం అర్థాకలితో అలమటిస్తున్నారన్నారు. గుజరాత్ ప్రజలది తాగునీరు కొనుక్కునే దుస్థితి అని మండిపడ్డారు. గుజరాత్‌లో ప్రజలకు విద్యుత్ సరఫరా కూడా ఆరు గంటలేనని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో ఆసరా పింఛన్ అందేది రూ.600 మాత్రమేనని మంత్రి తెలిపారు. అక్కడ మోటార్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి బిల్లుల వసూలు చేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ మాకెందుకు ఇవ్వడం లేదనే చర్చ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మొదలైందని, ఇంటింటికి మంచినీరు మాకెందుకు ఇవ్వడం లేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మవడి పథకాలు మాకెందుకు లేవని జనం ప్రశ్నిస్తున్నారని, దాంతో బీజేపీ నేతల్లో కలవరం మొదలైందన్నారు. అందుకే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాలొడ్డుతున్నారని, సంక్షేమ పథకాలకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వాటన్నింటినీ అధిగమించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని మంత్రి చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలాని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img