ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. ఏపీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. కొందరు ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా కామెంట్లు చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ… హరీశ్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని… కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్ణకరమని అన్నారు. ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. విమర్శించాలనుకుంటే ఒక వ్యక్తిని విమర్శించాలే కానీ… తెలంగాణ రాష్ట్ర ప్రజలను విమర్శించడమేమిటని అన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ… ఏపీకి, తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ఏపీతో పోలిస్తే హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులు ఎంతో బాగున్నాయని చెప్పారు. ఏపీలో రోడ్లు, ఇతర సౌకర్యాలు, సేవలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. ఏపీ నుంచి వలస కార్మికులు ఏపీలో ఓటును వదిలేసి, తెలంగాణలో ఉంచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స, సీదిరి అప్పలరాజులు విమర్శలు గుప్పించారు.