Friday, June 9, 2023
Friday, June 9, 2023

పాలించే నైతిక హక్కు మోదీకిలేదు

కార్పొరేట్లకు దేశ సంపద ధారాదత్తం
హైదరాబాద్‌ సభలో నారాయణ, అజీజ్‌పాషా

విశాలాంధ్ర – హైదరాబాద్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు కల్పిస్తూ, దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌పాషా విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాష్ట్రాలలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్రంలోని బీజేపీి ప్రభుతాన్ని ఇంటికి పంపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను,కార్పొరేట్‌ అనుకూల విధాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘‘ఇంటింటికీ సీపీఐ’’ ప్రచారయాత్ర హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇందిరాపార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభ బహిరంగ సభనుద్దేశించి కె.నారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేపట్టాలన్నారు. ‘దళితుల చేతికి డబ్బులు ఇవ్వడం లేదని, ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నానని, దీనిని తలదించుకునేలా చేస్తారో, తలఎత్తుకునేలా వేస్తారా? మీ ఇష్టం, నిజాయితీగా ఓటు వేస్తే తల ఎత్తుకునేలా ఉంటారు. ఓటు అమ్ముకుంటే తల దించుకుని తిరుగుతారు’ అన్న అంబేద్కర్‌ మాటలను నారాయణ గుర్తు చేశారు. ప్రజల్లో ఇంకా ఆ చైతన్యం రాలేదని, వస్తే మోదీలాంటి ప్రమాదకారి అధికారంలో వస్తారా?, నిత్యం దళితులపై ఊచకోత కోసే ముఖ్యమంత్రులు అధికారంలోనికి వస్తారా? అని అన్నారు. పేదలు తమ ఓట్లు హకును సద్వినియోగం చేసుకుని తల ఎత్తుకుని తిరగాలన్నారు. కమ్యూనిస్టులు లేకపోతే పేదలకు ప్రభుత్వ భూములు దక్కకపోగా, ఆ భూములు భూస్వాముల, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆధీనంలో ఉండేవని అన్నారు. భూ సమస్యలపైన మరింత పోరాటం చేయాలని, ఒక కాలు భూమి మీద,మరో కాలు జైలులో ఉండేలా పోరాటం చేస్తేనే భూ సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. మోదీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారని, అందులో 29 మంది విదేశాలకు పారిపోగా మరో దత్త పుత్రుడు అదానీ ఇక్కడే ఉన్నారని, ఆయనకు దేశ సంపదను కట్టబెడు తున్నారని విమర్శించారు. అదానీకి ఇచ్చిన రాయితీల్లో పది శాతం ఖర్చు చేసినా పేద ప్రజానీకానికి ఇళ్లను నిర్మించవచ్చని, ప్రాజెక్ట్‌ నిర్మించవచ్చని తెలిపారు. ఏ మూలకు పోయినా కార్యకర్తలు ఉన్న సీపీఐకి జాతీయ పార్టీ గుర్తింపు తీసేస్తారా?అని ప్రశ్నించారు. ప్రజలే సీపీఐకి గుర్తింపునిస్తారని, బీజేపీ కుట్రను ప్రజాక్షేత్రంలో తేల్చు కుంటామని నారాయణ హెచ్చరించారు. సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదన్నారు.ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీలను అధికారంలోనికి వచ్చిన తర్వాత చెత్తకుప్పలో పడేశారని, పేదలను, మహిళలు, నిరుద్యోగులను విస్మరించారని విమర్శించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో కమ్యూనిస్టు పార్టీ పట్ల ఉన్న స్థానాన్ని ఏ ఎన్నికల కమిషన్‌ చెరపలేదని రుజువు చేయాలని పిలుపునిచ్చారు. దోపిడీదారుల గుండెలు అదిరే పద్ధతుల్లో సీపీిఐ సింహగర్జన చేస్తుందని, నడుస్తూనే ఉంటుందన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐ చేపట్టే పోరాటాలు, న్యాయ సమత్మమైనవని, చట్టబద్ధమన్నారు. పాలక వర్గాలు పని చేయకపోతే పోరాడి సాధించుకోవాలని, అదే అంబేద్కర్‌ సందేశమని, ఆ దిశగా ప్రజలలో చైతన్యం కల్పించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపలి సీతారాములు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటాన్ని కొనసాగి స్తామన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, ధరలకు ప్రధాన కారణమే మోదీ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం ప్రమాదకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీపీిఐ చేపట్టిన ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో సీపీఎం శ్రేణులు కూడా పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img