Friday, August 19, 2022
Friday, August 19, 2022

ప్రతి ఎకరాకు నీరు: సబిత

విశాలాంధ్ర-అమనగల్లు:
ప్రతి ఎకరాకు నీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అందుగుల గ్రామంలో నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, రైతు వేదిక భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలకొండ, కొత్త బ్రాహ్మణపల్లి సబ్‌ స్టేషన్లకు ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అందుగుల, కలకొండలలో ఏర్పాటు చేసిన సభలలో మంత్రి మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి, జాతీయ హోదా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్టును పూర్తి చేసిందన్నారు.
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని చెప్పారని, ఎనిమిదేళ్ల టీిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేసి వారి నోర్లు మూయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది అన్నారు. వరి ధాన్యం కొనమని కేంద్రం పట్టు పట్టినా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిందని ఆమె పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా మీటర్లు పెట్టలేదని, రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతూ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించామన్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు ఖాళీగా ఉన్న 80వేల ఉద్యోగాలను అంచెలంచెలుగా భర్తీ చేస్తున్నామని, దేశంలో దళిత బంధు అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. త్వరలో 57 సంవత్సరాలు నిండిన అర్హులైన వారికి పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీపీ పద్మా రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గిరి యాదవ్‌, వైస్‌ ఎంపీపీ శంకర్‌ నాయక్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రవి తేజ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జైపాల్‌ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు రాజు, రవీందరరెడ్డి, కృష్ణరెడ్డి, జంగయ్య గౌడ్‌, ఎంపీటీసీలు, విద్యుత్‌ శాఖ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు చలమంద గౌడ్‌, మహేష్‌, లాలయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img