తెలంగాణలో కరోనా కేసులు, వైరస్ కట్టడిపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ డి.శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. కేవలం మూడు రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. తెలంగాణలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తోన్న కిట్‌లలో పిల్లలకు అవసరమైన మందులు లేవని అన్నారు.అయితే, మరోపక్క ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు పలు వివరాలు తెలిపారు. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రత లేదని చెప్పారు. పాజిటివిటీ 10 శాతం దాటితేనే రాత్రి కర్ఫ్యూ అవసరమని తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని, తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ 10 శాతం మించలేదని వివరించారు.అలాగే, ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని, కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముందు జాగ్రత్తగా జన సమూహాలు లేకుండా ప్రభుత్వం ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు గుర్తు చేశారు. వారం రోజులుగా తెలంగాణలో రోజుకు లక్ష చొప్పున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. కొవిడ్ నిబంధనలను జీహెచ్‌ఎంసీ, పోలీసులు కఠినంగా అమలుచేయాలని ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు తడుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.