మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. చండూర్ మండల కేంద్రానికి చేరుకొని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.అనంతరం కోటమైసమ్మ తల్లి మూడో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఎంతో దార్శనికతతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో కరువు అన్నదే రాదన్నారు. సీఎం ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీటీసీ స్వరూప, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.