Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

మోదీది అబద్ధాలకోరు ప్రభుత్వం

దేశంలో అప్రకటిత ఫాసిజం
బీజేపీని గద్దెదించడమే లక్ష్యం
సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర`హైదరాబాద్‌: రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడిరచాలని, ఇందుకోసం లౌకిక, ప్రజాతంత్ర, వామపక్షశక్తులు ఏకం కావాలని సీపీఐ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. మోదీది అబద్దాలకోరు ప్రభుత్వమని, దీని ప్రభావంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా అబద్ధాలు చెబుతున్నారన్నారు. దేశంలో అప్రకటిత ఫాసిజం ఉన్నదని నారాయణ అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తే ఎటువంటి వారినైనా కమలం పువ్వులతో పూజిస్తూ, వ్యతిరేకించే వారిని సీబీఐ, ఈడీతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సీపీఐ 24వ జాతీయ మహాసభలు ఘనంగా ముగిశాయని, ఏపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినా, 70వేల మంది పాల్గొని ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేశారన్నారు.17 దేశాల నుంచి సౌహార్థ్ర ప్రతినిధులు హాజరయ్యారని, చర్చలూ ఫలప్రదంగా సాగాయని చెప్పారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం మగ్దూంభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన వెంట సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎన్‌.బాలమల్లేశ్‌, ఇ.టి.నర్సింహా ఉన్నారు. నారాయణ మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలతో ఉన్న ఇబ్బందులు రాష్ట్రాలకే పరిమితం కావాలని, దేశవ్యాపితం కాకూడదని సూచించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను పక్కనపెట్టి బీజేపీపై పోరాటం చేయలేమన్నారు. ఏపీలో విచిత్ర పరిస్థితి ఉన్నదని, అధికార వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన… లౌకిక పార్టీలైనా మోదీకి భయపడి వంగి వంగి దండాలు పెడుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌ అసలైన తీవ్రవాదులు…
ప్రొఫెసర్‌ సాయిబాబాకు ముంబై హైకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడం దురదృష్టకరమని నారాయణ అన్నారు. ఈ చర్యను కేంద్రం సమర్ధించిందని, 90శాతం వైకల్యం కలిగిన వ్యక్తి విషయంలో న్యాయవ్యవస్థ కూడా మానవత్వంతో వ్యవహరించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్‌ నక్సల్స్‌ అంటున్నారుగానీ నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌ అసలైన తీవ్రవాదులని విమర్శించారు. గోరక్ష పేరిట దాడులు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన వారికి సన్మానాలు చేశారని దుయ్యపట్టారు. ఉచితాలు అంటూ రైతులకు చేసే సహాయాలపై బీజీపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని నారాయణ అన్నారు. ఐదేళ్లలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.9లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారన్నారు.
పోరాటాలకు సంసిద్ధం: అజీజ్‌ పాషా
సీపీఐ జాతీయ మహాసభల రాజకీయ తీర్మానానికి అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు, శక్తులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటాలకు సిద్ధమవుతామని సయ్యద్‌ అజీజ్‌ పాషా అన్నారు. మహాత్మాగాంధీ మాటలను అనుసరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని భారత్‌ పర్యటనలో ఉన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌ అన్నారని గుర్తుచేశారు. మోదీ మాత్రం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో గాంధీని స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే గుర్తించారని, జాతిపిత అనే విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. మాజీ ప్రధాని, బీజేపీ నేత వాజ్‌పేయి విశాల దృక్పథంతో ఉండేవారని, విమర్శలు కాదు చెంచాగిరికి భయపడతానని అనేకసార్లు పార్లమెంటులో చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ తీరు పూర్తి భిన్నంగా ఉన్నదని, చెంచాగిరి చేసేవారికే పదువులిస్తారని ఎద్దేవా చేశారు. సీపీఐ మహాసభలకు అన్ని రాష్ట్రాల వారు రాగా తొలిసారిగా నాగాలాండ్‌, లక్షద్వీప్‌ ప్రతినిధులు హాజరయ్యారని అజీజ్‌పాషా తెలిపారు. చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ జాతీయ మహాసభ తీర్మానించిందని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలపై సీపీఐ ఉద్యమిస్తోందని, కలిసొచ్చే పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయనన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img