Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

మోదీ సామాన్యుల రక్తం పీల్చే జలగ

. కేంద్రంపై నారాయణ విమర్శ
. హైదరాబాద్‌లో సీపీఐ పాదయాత్ర

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చే జలగ వంటిదని, మోయలేని పన్నుల భారం మోపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. మోదీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో దిగజారిపోతోందని, కానీ పేదరికం, నిరుద్యోగం, అసమానతలు మాత్రం గణ నీయంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రజావ్యతరేక నిరంకుశ విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోరుతూ హైదరాబాద్‌, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మంగళవారం సీపీఐ అధ్వర్యాన పాదయాత్ర జరిగింది. నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవితోపాటు సీపీఐ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. బీజేపీ ప్రజా వ్యతరేక విధానాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలని విజ్ఞప్తి చేశారు.
నారాయణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో అదానీ, అంబానీ వంటి కొంతమంది పెట్టుబడిదారుల ఆస్తులు గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు నిండా మునిగిపోతున్నాయని విమర్శించారు. మోదీ సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు పయనిస్తున్నదని వివరించారు. ఇంధనం, నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిరదని నారాయణ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రతి వాగ్దానం మోసపూరితమైనదేనని, ఇందుకుగాను వచ్చే ఎన్నికల్లో బీజేపీని, మోదీని ఓడిరచి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు నారాయణ విజ్ఞప్తి చేశారు. నరసింహ మాట్లాడుతూ ఒకే దేశం-ఒకే జాతి నినాదం బూటక మన్నారు. మత విద్వేషంతో విద్య, కళ, సంస్కృతి, మతాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాదయాత్రలో సీపీఐ హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్‌, రాష్ట్ర సమితి సభ్యులు బి.వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్‌, నేతలు ఆరుట్ల రాజ్‌కుమార్‌, చక్రిభాయ్‌, చైతన్య యాదవ్‌, బాలకృష్ణ, బి.రాజుగౌడ్‌, కల్యాణ్‌, ఎండీ అహ్మద్‌, అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.
శ్మశానవాటికల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
బేగారి వృత్తిదారుల ఉపాధిని దెబ్బతీసేందుకు శ్మశాన వాటికల ప్రైవేటీకరణకు పాలకులు పూనుకుంటున్నారని, దీనిని అడ్డుకుంటామని నారాయణ స్పష్టంచేశారు. హైదరా బాద్‌ పంజాగుట్ట శ్మశాన వాటికలో బేగారి వృత్తిదారులతో కలసి నారాయణ పాదయాత్ర చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిర్మించిన శ్మశానవాటికను పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ వేలాది సంవత్స రాలుగా కాటికాపరులు శ్మశానవాటికలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని, వారి వృత్తిని దెబ్బతీస్తే సహించేది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి శ్మశాన వాటికల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, లేకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని నారాయణ హెచ్చరించారు.
చీకోటి ప్రవీణ్‌ను దేశ బహిష్కరణ చేయాలి
చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమ వ్యాపారాలు చేస్తూ థాయ్‌లాండ్‌లో పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్‌ను దేశ బహిష్కరణ చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. చీకోటి ప్రవీణ్‌ థాయ్‌లాండ్‌కు మహిళలను తీసుకెళ్లి కేసినో ఆడిస్తున్నారని, కేసినో ఆడుతూ థాయ్‌లాండ్‌ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. బీజేపీతో చీకోటి బంధం బహిర్గతమేనని పేర్కొన్నారు. గుడివాడ, హైదరాబాద్‌ లోనూ కేసినో నడిపాడని, ఇతని వల్ల ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతింటుందని నారాయణ మండి పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని థాయ్‌లాండ్‌లో ఎంతమంది అరెస్టయ్యారు… ఇక్కడి నుంచి జనాలను ఎన్నిసార్లు తీసుకెళ్లాడు వంటి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. చీకోటి ప్రవీణ్‌, అతని అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్న కొందరు బీజేపీ నేతలను సైతం దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img