తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.దక్షిణ, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఇక అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం వేళ పొగమంచు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణం కంటే 28 శాతం అధికంగా ఉందని, రాష్ట్రంలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.