రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు
రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు ప్రశ్నా పత్రాలు వాట్సాప్ లో షేర్ చేస్తున్నారని విమర్శ
తమ రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. తాండూరు ఘటనతో పాటు వరంగల్ ఘటనలు ఉద్దేశ్యపూర్వకంగా జరిగినవన్నారు. ప్రశ్నాపత్రాలను వాట్సాప్ లో షేర్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హిందీ పేపర్ లీక్ అయిందని వైరల్ చేసిన ప్రశాంత్ రెండు గంటల్లో 144 ఫోన్ కాల్స్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పదో తరగతి పరీక్షల లీకేజీపై ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై బాధ్యత ఉన్న ఏ పార్టీ నేతలు కూడా ఇలా వ్యవహరించబోరన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకుంటే ప్రతిపక్షాలకు వేరే అంశాలున్నాయన్నారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. పేపర్లను ఎవరు లీక్ చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం లేదన్నారు.