మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాష్ట్రంలో రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు 64 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు సహాయాన్ని జమ చేసినట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా 5 వేల 849 కోట్ల రూపాయలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతుల ఖాతాల్లో రైతు బంధు సహాయాన్ని జమ చేశామని చెప్పారు. జనగామ జిల్లాలో 1481 కోట్ల 73 లక్షల రూపాయలు, వరంగల్ జిల్లాలో 940 కోట్ల 51 లక్షల రూపాయలు, హన్మకొండ జిల్లాలో 916 కోట్ల 79 లక్షల రూపాయలు, జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో 756 కోట్ల రూపాయలు, మహబూబాబాద్ జిల్లాలో 1273 కోట్ల రూపాయలు, ములుగు జిల్లాలో 481 కోట్ల 96 లక్షల రూపాయలు రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్ధిక సహాయం అందించామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయం సోమవారం నాటికి 50 వేల కోట్ల రూపాయలకు చేరిన సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు నిర్వహించాలని అయన పిలుపిచ్చారు.