Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం..: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. పార్టీలన్నీ స్పీడ్‌ పెంచుతున్నాయి.ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని, సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వచ్చే అవకాశముందని మంత్రి ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న క్రమంలో.. మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అటు మంగళవారం ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ సభకు వెయ్యి మంది వాలంటీర్లను నియమించగా.. క్రమశిక్షణతో వాలంటీర్లు పనిచేయాలని సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకోవాలని వాలంటీర్లకు హరీష్‌ రావు సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్కింగ్‌ సౌకర్యంతో పాటు డ్రైవర్లకు క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 15 వేల మంది వీఐపీలకు స్పెషల్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. 400 ఎకరాల్లో 20 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సభను విజయవంతం చేసేలా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు ఈ సభకు వస్తున్నట్లు హరీష్‌ రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img