Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

విద్యార్థులకు ఉచితంగా వర్క్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా వర్క్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌ అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్స్ బుక్స్ ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం కే చంద్రశేఖర్ రావు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదని మంత్రి పేర్కొన్నారు.
ఇవాళ సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఉచిత పుస్తకాల నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వర్క్ బుక్స్‌ను, నోట్‌ బుక్స్‌ను పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను పాఠశాల పునః ప్రారంభమయ్యే నాటికి అందజేయాలని ఆదేశించారు.గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, రానున్న విద్యా సంవత్సరానికిగాను రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్ ను పాఠశాల పునః ప్రారంభం నాటికి అందేజేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జూన్ 12 నుంచి పాఠశాల పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌ల పంపిణీ చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలలకు హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలన్నారు. పాఠశాల పునః ప్రారంభం రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాల విద్య సంచాలకులు, శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img