Monday, January 30, 2023
Monday, January 30, 2023

వైఎస్‌ షర్మిలకు అండగా కొండా సురేఖ

ఉమ్మడి వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద జరిగిన దాడికి నిరసనగా వైఎస్‌ షర్మిల మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనను భగ్నం చేయడంలో భాగంగా పోలీసులు ఆమెను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారి కళ్లు గప్పి ఆమె ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం హైకోర్టు ముందు ప్రవేశపెట్టగా.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. పార్టీ అధినేత్రిపై దాడి చేయడం సరికాదు.. ఈ ఘటన పట్ల తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ దాడిని ఆమె తప్పుపట్టారు. ఓ మహిళ నాయకురాలి పట్ల పోలీసులు, ప్రభుత్వం హేయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఒక రాజకీయ పార్టీ అధినేత్రిపై పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ ఇంత దారుణంగా వ్యవహరించకూడదని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సుదీర్ఘకాలంగా పాదయాత్ర చేస్తోన్న ఓ మహిళ నాయకురాలిపై దాడి చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, అణచివేతకు ఈ ఉదంతం ఓ నిదర్శనమని విమర్శించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వైఎస్‌ షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తోన్నారని, వాటిని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. గ్రామస్థాయిలో ప్రజలుఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని, అందుకే ఇలా ఎదురుదాడికి దిగుతోందని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నప్పుడు వాటిని స్వీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదేనని కొండా సురేఖ గుర్తు చేశారు. గతంలో చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎదుర్కొంటోన్న ఎలాంటి సమస్యల్కెనా ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాల్సిన హక్కు ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. అధికారులను కలుసుకోలేని దుస్థితి.. ప్రభుత్వం సరిగ్గా పని చేయనప్పుడు, తమ సమస్యలను పరిష్కరించలేనప్పుడు ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపే మొగ్గు చూపుతారని, లేదా ప్రతిపక్షాలే ప్రజల వద్దకు వెళ్తాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలు కనీసం తమ సమస్యలను చెప్పుకోవడానికైనా ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యేలు గానీ, అధికారులను గానీ కలుసుకునే అవకాశం ఎంత మాత్రం లేకుండా పోయిందని కొండా సురేఖ విమర్శించారు. కక్ష పెంచుకున్నారా? అందుకే- వైఎస్‌ షర్మిల పాదయాత్రలో ప్రజలు తమ అనేక రకాల విజ్ఞప్తులు చేస్తోన్నారని కొండా సురేఖ అన్నారు. వాటినే ఆమె తన సభలు, సమావేశాల్లో ప్రస్తావిస్తోన్నారని పేర్కొన్నారు. ఆమె ద్వారా ప్రజల నుంచి అందుతోన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలే తప్ప దాడులు చేయడం సరికాదని చెప్పారు. దీనికి బదులుగా ప్రతిపక్షాలపై కక్ష పెంచుకుని, వారిని మాట్లాడనివ్వకుండా, బయటికి రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏం చేసినా నోరుమూసుకుని పడి ఉండాలా? తాము ఏం చేసినా కూడా ప్రజలు నోరుమూసుకుని పడి ఉండాలనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ కొండా సురేఖ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు సామాన్యులపై ఎన్నో రకాల దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అవుతూనే ఉన్నాయని చెప్పారు. అలాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతిపక్ష నాయకులకు ఉంటుందని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img