Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త : డీహెచ్‌ శ్రీనివాసరావు

భారీవర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. హైదరాబాద్‌లో 516, మిగితా కేసులు కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయని డీహెచ్‌ తెలిపారు. భద్రాద్రిలో 115, మలుగులో 113, భూపాలపల్లిలో నాలుగు, ఆసిఫాబాద్‌లో మూడు, నల్లగొండలో ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పారు. మే నెలలో మూడు చికున్‌ గున్యా కేసులు రికార్డయ్యాయన్నారు. ఈ నెలలో ఆరువేల విరేచనాల కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది టైఫాయిడ్‌ కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయన్నారు. ప్రజలు ‘ఫ్రై డే డ్రై డే’ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలి, ఆహారం వేడిగా ఉండేలా చేసుకోవాలని.. అదే సమయంలో గోరువెచ్చటి నీటిని తీసుకోవాలన్నారు.ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా.. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో గర్భిణులు వారం ముందే ఆసుపత్రుల్లో చేరి వైద్యం తీసుకోవాలన్నారు. బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img