Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంతా తెలంగాణ సర్కార్‌ నిర్వాకమే

ధాన్యం ఎందుకు కొనడం లేదో చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రబుత్వాల మధ్య ధాన్యం వివాదం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను ఏకరవు పెడుతూ… కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ లేఖ విడుదల చేసింది. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం బియ్యం పంపిణీలో తెలంగాణ పూర్తిగా విఫలమయిందని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా కారణంగా పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించింది. ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్‌, మే రెండు నెలల కోటా లక్షా 90 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుందని కానీ పేదలకు పంపిణీ చేయలేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పష్టం చేసింది. అదే విధంగా అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ తెలంగాణ సర్కార్‌ విఫలమయిందని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం స్డాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను అమలు చేయలేదని తెలిపింది. అందుకే సెంట్రల్‌ పూల్‌లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేశామన్నారు. ఈ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అని స్పష్టం చేసింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల్లో ఎన్నో కీలక అంశాలు వెల్లడయ్యాయని కేంద్రం చెబుతోంది. రైస్‌ మిల్లుల్లో తనిఖీలు చేసినప్పుడు లక్షల సంఖ్యలో బియ్యం బస్తాలు కనిపించలేదని కేంద్రం ఆరోపించింది. కేవలం 40 మిల్లుల్లోనే కనిపించని బియ్యం బస్తాల సంఖ్య 4, 53, 896 ఉన్నాయని తెలిపింది. 593 రైస్‌ మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం నిల్వచేశారన్నారు. ధాన్యం విషయంలో తాము ఎప్పటికప్పుడు లోపాలు ఎత్తి చూపుతున్నా.. తనిఖీల తర్వాత సూచనలు చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం తెలిపింది. లోపాలు సరిదిద్దుతామని హామీ ఇచ్చినా.. పట్టించుకోలేదని పేర్కొంది. అక్రమాలకు పాల్పడినట్లుగా తేలినా మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని తెలిపింది. వీటన్నింటిపై తెలంగాణ సర్కార్‌కు ఎఫ్‌సీఐ రిపోర్ట్‌ అందచేయాల్సి ఉందని .. ఆ రిపోర్ట్‌ ఇస్తే.. సెంట్రల్‌ పూర్‌లోకి తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ప్రతీ ఏడాది ధాన్యం సేకరణ అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణం అవుతోంది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది. తెలంగాణ సర్కార్‌ తీరు వల్లే తాము ధాన్యం సేకరించడం లేదని నేరుగా చెప్పడంతో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా రెడీ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img