Friday, April 19, 2024
Friday, April 19, 2024

అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

అడవుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతోపాటు పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 12 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి వీడియో కాన్పరెన్సు ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని సీఎం కె. చంద్రశేఖరరావు నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వం గత 7 సంవత్సరాల్లో తెలంగాణకు హరితహారం పేరిట 2 కోట్ల 48 లక్షల మొక్కలు నాటిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెరిగిందని అన్నారు.పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమాయకమైన గిరిజనులు, ఇతర వర్గాలకు చెందిన పేదలకు నష్టం జరగకుండా, అదే సమయంలో భూ కబ్జాదారులు, రియల్‌ ఎస్టేట్‌ వారు దుర్వినియోగం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. అడవులను విధ్వంసం చేసే వారిని గుర్తించి వారిపై కఠినంగా పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని, ఇక ముందు భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని జిల్లా ఎస్పీని మంత్రి ఆదేశించారు.జగిత్యాల జిల్లాలో ఆక్రమణకు గురైన అటవీ భూములలో మరొక్కసారి రీసర్వే చేసి ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతుల పూర్తి వివరాలు సేకరించాలని, భూ కబ్జాదారులు, రియల్‌ స్టేట్‌ చేసే వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ ప్రాంతాలు ఉన్న ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.నవంబరులో పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్‌ స్వీకరిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img