Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇంతదూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణం ఎవరు?

దిల్లీలోని తెలంగాణభవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన రైతుదీక్షలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందన్నారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని అన్నారు. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో తెలంగాణ మంత్రిమండలి, రైతులు దిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది? అని అన్నారు. ‘‘నిన్ను గద్దె దించే సత్తా రైతులకు ఉంది’’ అంటూ భారత ప్రధాని మోదీని హెచ్చరించారు. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా.. మనసు లేదా? అని ప్రశ్నించారు. రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ దొరికేవరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తామంతా రాకేశ్‌ టికాయత్‌ పోరాటానికి మద్ధతిస్తున్నామని ప్రకటించారు. దేశంలో మేం సృష్టించే భూకంపానికి పీయూష్‌ గోల్‌మాల్‌ కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. హిట్లర్‌, ముస్సోలినీ వంటి ఎందరో మట్టికలిశారు. మీరెంత? అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈడీ, సీబీఐలు ఏ బీజేపీ నేత ఇంటికీ వెళ్లవని చెప్పారు. తన్ను జైలుకు పంపుతా అని అంటున్నారని, దమ్ముంటే తనను జైలుకు పంపాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఉన్న చోటామోటా కుక్కలు మొరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మిగతా దేశంలో ఎలా ధాన్యం కొంటున్నారో.. మా దగ్గర కూడా అలాగే ధాన్యం కొనండి అని నరేంద్ర మోదీకి, పీయూష్‌ గోయల్‌కు రెండు చేతులూ జోడిరచి కోరారు. 24 గంటల్లో మీ సమాధానం చెప్పాలని, లేదంటే మేం ఏం చేయాలో చేసి చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత మా వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్తామని చెప్పారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్‌ గోయల్‌ అన్నారు అని తెలిపారు. ధర్మబద్ధమైన డిమాండుతో మేమొస్తే, ఆయన ఇలా అవమానించారని అన్నారు. ఆయన పీయూష్‌ గోయల్‌ కాదు పీయూష్‌ గోల్‌మాల్‌ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో తెలంగాణలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందన్నారు. తెలంగాణలో 30 లక్షల బోర్‌ బావులు ఉన్నాయని, వాటిపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాల్సి వచ్చిందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 20 లక్షల మంది కార్మికులు దేశంలో నలుమూలలకు వెళ్లారన్నారు. 1956 నుంచి మొదలుపెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చామని, అనేక పోరాటాల తర్వాత 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img