Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘ఉంటే ఎంత ? పోతే ఎంత ?’.. ప్రగతిభవన్‌పై రేవంత్‌ మరోసారి కామెంట్స్‌

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. రేవంత్‌ ప్రగతి భవన్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆ హీట్‌ మరింత పెరిగింది. భారత్‌ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలంగాణలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా నిన్న (ఫిబ్రవరి 7న) ములుగు జిల్లాలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు ప్రగతిభవన్‌ పేల్చేసినా ఎవరికీ అభ్యంతరం లేదని వివాదస్పద కామెంట్లు చేశారు.‘‘పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశాడు. ఆయన మాత్రం హైదరాబాద్‌ నడిబొడ్డున పది ఎకరాలల్లో రూ.2 వేల కోట్లతో 150 గదుల ప్రగతి భవన్‌ నిర్మించుకున్నాడు. ప్రగతిభవన్‌లో ఏపీ పెట్టుబడుదారులకు ఎర్ర తీవాచీతో స్వాగతిస్తున్నారు. పేదలకు మాత్రం అందులో ప్రవేశం లేదు. అటువంటి ప్రగతి భవన్‌ ఎందుకు ? ఆనాడు గడీలను గ్రానైట్‌లతో పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్‌ను పేల్చేయాలి.’’ అంటూ రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రేవంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగుతోంది. ఆయనే చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, అల్లర్లు సృష్టించేలా ప్రసంగించిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీసు స్టేషన్‌లో గులాబీ నేతలు ఫిర్యాదులు చేశారు. రేవంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఇలాగే విద్వేషాలు రెచ్చగొడితే పాదయాత్రను అడ్డుకుంటామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.
అయితే.. రేవంత్‌ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తనకేమీ కేసులు కొత్త కాదని.. ఎన్ని కేసులైనా పెట్టుకోండని ఫైరయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌పై రేవంత్‌ రెడ్డి మరోసారి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘అమరవీరుల కుటుంబాలను కూడా ప్రగతిభవన్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధం పెట్టారు. అలాంటి ప్రగతి భవన్‌ ఉంటే ఎంత ? పోతే ఎంత? ప్రగతి భవన్‌లోకి సామాన్య ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదని అడుగుతున్నా. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలను ఎందుకు రానివ్వరు. కోట్లాడి, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ద్రోహులను వెతికి మరీ ప్రగతి భవన్‌లో కూర్చోబెట్టారు. తెలంగాణ అనే పదాన్ని అసహ్యించుకున్న వారందరికి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చోటు కల్పించారు.’’ అని రేవంత్‌ మరోసారి ఫైరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుపై రేవంత్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. కోవర్టు ఆపరేషన్‌లో మంత్రి ఎర్రబెల్లి ఎక్స్‌పర్ట్‌ అని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారని ఆక్షేపించారు. మంత్రుల్లో 90 శాతం తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img