Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరుకావడం లేదా ప్రతినిధిని పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రతినిధిగా తన లీగల్ అడ్వైజర్ సోమ భరత్‌ను కవిత ఈడీ ఆఫీసుకు పంపారు. కవిత తరపున ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లి హాజరయ్యారు. ఇప్పటివరకు కవిత మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠకరంగా మారింది.ఈ నెల 11,20,21 తేదీల్లో కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖితపూర్వక వాదనలు వినిపించాలని కవిత, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితకు ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది. ఈ మేరకు కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఓ లేఖ రాశారు. కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాలని తెలిపారు. ఈ ఫోన్లను ఓపెన్ చేసేందుకు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి నేరుగా విచారణకు రావాలని కోరే అవకాశముందని తెలుస్తోంది.మార్చి 11న కవిత ఫోన్‌ను ఈడీ సీజ్ చేయగా.. ఈ నెల 21న ఈడీకి 9 ఫోన్లు ఆమె సమర్పించారు. మొత్తం కవితకు సంబంధించిన 10 ఫోన్లను ఇప్పటివరకు ఈడీ స్వాధీనం చేసుకుంది. విచారణకు హాజరయ్యే ముందు కవర్‌లో తన ఫోన్లను మీడియాకు కవిత చూపించారు. వీటిని ఈడీకి అప్పగించినట్లు చెప్పారు. తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు సీబీఐ పేర్కొందని, అవన్నీ అబద్దమని కవిత ఈడీకి లేఖ రాశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు దర్యాప్తు సంస్థలు చేశాయని, మహిళను అయినా తన ఫోన్లను ఇస్తున్నట్లు తెలిపారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పుకొచ్చారు. అటు కవితకు వరుస నోటీసులు నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img