Friday, April 19, 2024
Friday, April 19, 2024

కబ్జాకు గురయ్యే భూములనే వేలం వేశాం

తెలంగాణ ఇప్పటికీ ధనిక రాష్ట్రమే..
రమణకు త్వరలో సముచిత స్థానం : సీఎం కేసీఆర్‌

విశాలాంధ్ర ` హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ శుక్రవారం ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణతో పాటు అయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ గత 25ఏళ్ళుగా రమణ తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని అయన ఏ పార్టీలో వున్నా ఆ పార్టీ సిద్దాంతలకు కట్టుబడి పనిచేస్తారని, ఇలాంటి వారే రాజకీయ పార్టీలకు అవసరం అని అన్నారు. తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలకునుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. నగరంలోని 40 ఎకరాలు అమ్మితే రూ.2వేల కోట్లు వచ్చాయని కాని కబ్జాలకు గురయ్యే అవకాశాలున్నా ప్రభుత్వం భూములనే ప్రభుత్వం అమ్ముతుందని స్పష్టం చేశారు. భూములను అమ్మిన డబ్బులను పేదల సంక్షేమం కోసమే ఖర్చు చేయడం జరుగుతుందని ఇపుడు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రంగానే వుందని స్పష్టం చేశారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాని దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక జీతాలు పొందుతున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. చేనేత రంగం కష్టాలు తనకు తెలుసని అందుకే ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులను ఉద్యమ సమయంలో పార్టీ తరఫున ఆదుకోవడం జరిగిందని ఇపుడు వచ్చే రెండు మూడు నెలల్లో చేనేత భీమా పథకం కూడా మొదలవుతుందని స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా నేత కార్మికులు మారిన నేపధ్యాన్ని గమనించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే చేనేత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ కోసం అందరూ కాడి కింద పెట్టినపుడు నేను ఒక్కడిగా జెండా ఎత్తానని, తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ ఒంటరిగా బయలుదేరాడని చెపుకొచ్చారు. ఒకపుడు తెలంగాణలో వ్యవసాయ రంగం నుంచి 16వేల కోట్ల జీఎస్‌డిపి లభిస్తే అదిప్పుడు 50 వేల కోట్లకు చేరిందని వివరించారు. అలాగే తలసరి విద్యుత్‌లో తెలంగాణ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో కొనసాగుతుందని, ఒకపుడు తెలంగాణలో తలసరి విద్యుత్‌ వినియోగం 1070 యూనిట్లు ఉంటె ఇపుడు 2170 యూనిట్లకు చేరిందన్నారు. కరెంటులో అట్టడుగున ఉన్న తెలంగాణ ఇపుడు అగ్రభాగానికి చేరిందని చెప్పారు. అలాగే భూసమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన ధరణి ఒక విప్లవం అని దీంతో రైతుల బాధలు తొలగిపోయాయని అన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణను 100శాతం నెరవేరుస్తానని, కేసీఆర్‌కు ప్రజలు కలగన్న తెలంగాణ తప్ప వేరే పనిలేదని స్పష్టం చేశారు. తన లైన్‌ను ఎవ్వరూ మార్చలేరని, నాకు ఈ వయసులో తెలంగాణ ధ్యాస తప్ప మరొకటి లేదని అన్నారు. నేను కలలు కన్న రీతిలో తెలంగాణ అభివృద్ధి అయ్యేదాకా విశ్రమించనని తెలిపారు.
ప్రజలకు మంచి తప్ప, తప్పు చేయలేమన్నారు. అధికారాన్ని తెలంగాణ కోసం సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయొద్దన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆరు నెలల ముందే మిషన్‌ కాకతీయ కార్యక్రమం ఆలోచన చేసామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన యల్‌.రమనకు స్వాగతం అన్నారు. త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తామని, అలాగే అవకాశం చిక్కినప్పుడల్లా పద్మశాలీలకు సముచిత స్థానం కల్పిస్తునే వున్నామన్నారు. గతంలో గుండు సుధారాణికి వరంగల్‌ మేయర్‌గా అవకాశమిచ్చామని, పార్థసారధిని ఎన్నికల కమిషనర్‌గా నియమించినట్లు గుర్తు చేశారు. త్వరలో మరింత మందికి అవకాశాలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ, పర్యాటక సాంస్కృతిక, క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img