Friday, April 19, 2024
Friday, April 19, 2024

కమ్యూనిస్టుల పునరేకీకరణ అవశ్యం

. ఫాసిజం, సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టాలి
. బీజేపీ ఓటమికి ఐక్యపోరు
. వామపక్ష నేతల పిలుపు
. ఉత్సాహంగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ మహాసభలు

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : కమ్యూనిస్టు ఉద్యమ నేతల గడ్డ, తెలంగాణలోని హైదరాబాద్‌లో గురువారం అఖిలభారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ)19వ జాతీయ మహాసభలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. మహాసభలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదిక కాగా బాగ్‌ లింగంపల్లి పరిసరాలన్నీ ఏఐఎఫ్‌బీ తోరణాలు, జెండాలు, హోర్డింగులతో కళకళలాడాయి. దేశ నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు హాజరయ్యారు. తొలుత బాగ్‌ లింగంపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించగా ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్‌ ఏఐఎఫ్‌బీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మధ్యాహ్నం జరిగిన ప్రతినిధుల సభలో దేబబ్రత బిశ్వాస్‌తో పాటు ఏఐఎఫ్‌బీ డిప్యూటీ చైర్మన్‌, మాజీ ఎమ్యెల్యే పీవీ కతిరావన్‌, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.దేవరాజన్‌, జీఆర్‌ శివశంకర్‌, నరేన్‌ ఛటర్జీ, గోవింద రాయ్‌, జ్యోతి రాజన్‌, అమరేశ్‌ కుమార్‌తోపాటు సౌహార్థ ప్రతినిధులుగా సీపీఐ కార్యదర్శి డా. కె.నారాయణ, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సుభాషిణిఅలీ, ఆర్‌ఎస్పీ నేత ప్రేమ్‌ చంద్రన్‌, సీపీఐ ఎం.ఎల్‌ జాతీయ నేత ఎన్‌.మూర్తి పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ దేశంలోని మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలన్నీ ఐకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఇటువంటి ప్రమాద పరిస్థితుల్లో వామపక్ష శక్తులన్నీ ఏకమై అలుపెరుగని పోరాటాలకు నాంది పలకాలని సూచించారు. వామపక్షాల ఐక్యతకు ఎఐఎఫ్‌బీ సమావేశాలు దోహదమయ్యాయన్నారు.
సీపీఐ కార్యదర్శి కె.నారాయణ సౌహార్థ్రసందేశం ఇస్తూ, కమ్యూనిస్టు పార్టీలు పునరేకీకరణ కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి ప్రమాదంలో పడిరదని, దేశంలో ఫాసిజం, సామ్రాజ్యవాదం పుంజుకున్నాయని, సామాజిక న్యాయ సూత్రాలు ప్రమాదంలో ఉన్నాయని, గుత్తాధిపత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. లౌకిక, ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కూడిన విస్తృత కూటమిని నిర్మించడం తక్షణావసరమని నొక్కిచెప్పారు. సీపీఎం నేత సుభాషిణీ అలీ మాట్లాడుతూ బీజేపీ ఫాసిస్టు…హిందూత్వ అజెండాను వేగంగా అమలు చేస్తోందని, మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు అనుకూల నిర్ణయాలతో ఊడిగం చేస్తోందని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దేశ వనరులను కార్పొరేట్‌కు దారాదత్తం చేస్తోందని, రైతుల భూములను స్వాధీనం చేసుకునేలా వ్యవసాయ చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఆర్‌ఎస్పీ నేత ప్రేమ్‌ చంద్రన్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగం తారాస్థాయికి పెరిగిందని, హిందూ`ముస్లింల పేరిట దేశాన్ని విభజిస్తున్నదని విమర్శించారు. 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకొస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు పెరుగుతుందన్నారు. సీపీఐ ఎంఎల్‌ నేత ఎన్‌.మూర్తి మట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తున్ను బీజేపీని అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలన్నీ ఐక్యపోరాటం సాగించాలన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకోవడం కమ్యూనిస్టుల వల్లనే సాధ్యమన్నారు. దేబబ్రత బిస్వాస్‌ మాట్లాడుతూ రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, నేతాజీ లాంటి అనేక మందిని హైజాక్‌ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మహాసభలలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్వీ ప్రసాద్‌, ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, కార్యదర్శి కె.తేజదీప్‌ రెడ్డి, నాయకులు బి.రాములు యాదవ్‌, జి.వంశీధర్‌ రెడ్డి, కొమ్మూరి వెంకటేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img