Friday, April 19, 2024
Friday, April 19, 2024

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావడం అసాధ్యం…

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు
ఢల్లీి పర్యటనలో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండకపోవచ్చని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అన్నారు. ఢల్లీిలో మీడియాతో మాట్లాడిన ఆమె జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఢల్లీి పర్యటనలో ఉన్న గవర్నర్‌ తమిళిసై రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తారని తనకు అనిపించడం లేదన్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్‌.. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన జాతీయ రాజకీయాల్లో రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో వరదలతో మునిగిపోయిన ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి తయారుచేసిన నివేదికను కేంద్ర హోంశాఖకు అందించినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో తన పర్యటనలకు అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని అన్నారు. తాను ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పోల్చుకుని ప్రోటోకాల్‌ ఆశించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు దగ్గరగా ఉండటం తన నైజమని.. వారు కష్టాల్లో ఉంటే వెళ్లి ఓదారుస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల రాజ్‌భవన్‌కు వచ్చిన తర్వాత కూడా అధికార యంత్రాంగం ప్రోటోకాల్‌ పాటించడం లేదన్నారు. ఇటీవల భద్రాచలం పర్యటనలోనూ అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img