Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా చీఫ్ మినిస్టర్ కప్ -2023 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని రాష్ట్ర రోడ్లు ఉ భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం రాష్ట్ర ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కప్-2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన క్రీడాకారుల చేతుల మీదుగా క్రీడా జ్యోతిని అందుకుని జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ, సహృద్భావ వాతావరణంలో పోటీలను విజయవంతం చేస్తామని క్రీడాకారులచే ప్రతిజ్ఞ చేయించారు. వాలీబాల్, ఖో-ఖో కబడ్డీ, ఆర్చరీ క్రీడాకారులను పరిచయం చేసుకుని లాంఛనంగా పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారు ప్రతిభను చాటుకునేందుకు వీలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్-2023 క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపు ఎల్లప్పుడూ గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతి పైనే కేంద్రీకృతమై ఉంటుందన్నారు. ఈ దిశగానే గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డులలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా నుండి మలావత్ పూర్ణతో పాటు నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుసాముద్దీన్, ఇషాసింగ్ వంటి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. క్రీడల నిర్వహణకు సహకరిస్తున్న పీడీలు, పీఈటీలను మంత్రి అభినందించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావులు మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడే క్రీడలను ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img