Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌

గణేష్‌ నిమజ్జనంపై హైకోర్ట్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ రివ్యూ పిటీషన్‌ దాఖలు చేశారు. తీర్పును పునఃపరిశీలించాలని కోరారు.తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. హుస్సేన్‌సాగర్‌, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని, ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని సాగర్‌లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని, హుస్సేన్‌సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మాణానికి ఉత్తర్వులు సవరించాలని పిటీషన్‌లో జీహెచ్‌ఎంసీ కోరింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. హుస్సేన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యామ్‌ నిర్మాణానికి కొంత సమయం అవసరమని తెలిపింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని తెలిపింది. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని ..ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హైకోర్టు ధర్మాసనానికి జీహెచ్‌ఎంసీ వివరించింది. కరోనా కట్టడికి మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపింది. జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో లంచ్‌ మోషన్‌ విచారణకు హైకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img