Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీఎస్‌ఆర్టీసీలో ఏసీ స్లీపర్‌ బస్సులు!

మంత్రి పువ్వాడ సూచనలతో మార్చిలో అందుబాటులోకి 16 ఏసీ స్లీపర్‌ బస్సులు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటి సారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్‌ లగ్జరీ, నాన్‌ ఏసీ స్లీపర్‌, సీటర్‌ కమ్‌ స్లీపర్‌ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్‌ హంగులతో ఏసీ స్లీపర్‌ బస్సులను రూపొందించింది. ప్రైవేట్‌ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్‌ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్‌ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. ఆయా బస్సులను మార్చి నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఇప్పటికే సంస్థకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టీఎస్‌ ఆర్టీసీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌ ప్రాంగణంలో కొత్త నమూనాతో ఏసీ స్లీపర్‌ బస్సును టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) డాక్టర్‌ వి.రవిందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) పీవీ ముని శేఖర్‌, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ (సీపీఎం) కృష్ణ కాంత్‌, చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌(సీటీఎం) జీవన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img